
అది ఫిబ్రవరి 2006. ఆక్సెంచర్ అనే ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయని తెలిసింది. ఇంటర్వ్యూ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా ? నేను చదివింది డిగ్రీ మాత్రమే. అందులో కూడా బొటాబొటీ మార్కులు.
ఇంటర్వ్యూ కోసం బూట్లు మరియు ఒక మంచి డ్రెస్ కావాలి. నాకున్నది ఒకటే ప్యాంట్ మరియు 2 షర్టులు. అవి కూడా పాతవి. బూట్లు అసలే లేవు.
శివ శంకర్ గానితో బూట్లు ఉన్నట్లు తెలుసు. ముందు రోజు వాడి రూమ్ కు వెళ్లి చూస్తే ఒక్క బూటు మాత్రమే బాగుంది. మరి రెండో బూటు ఎలా ? చివరికి రెండో బూటు ను కూడా ఎవరి రూమ్ లోనో దొరికించుకున్నా. మా తమ్ముడు భాస్కర్ నా ఖర్చుల కోసం 20 రూపాయలు ఇచ్చాడు.
ఇక మరుసటి రోజు బూట్లు వేసుకుని టక్ చేసుకుని రెడీ అయ్యి 9 గంటలకు బయలుదేరాను. ఇంటర్వ్యూ మధ్యాహ్నం 3 గంటలకు. జేబులో ఉన్న 20 రూపాయల తోనే దిల్ సుఖ్ నగర్ నుండి మాదాపూర్ వెళ్లి తిరిగి రావాలి. కానీ అవి రానుపోను బస్ టికెట్లకు సరిపోవు. రావడానికి లేదా పోవడానికి ఏదో ఒక రూట్ కు మాత్రమే సరిపోతాయి.
అందుకే కోఠి ఉమెన్స్ కాలేజీ వరకు బస్ లో వెళ్ళాను. అక్కడి నుంచి మాదాపూర్ 20 కిలో మీటర్లు. నడవడం ప్రారంభించాను. 10 కిలోమీటర్ల దూరం నడిచాను. అప్పటికే అలసి పోయాను. ఇంకా 10 కిలో మీటర్లు నడవాలి. ఒకవైపు మండుతున్న సూర్యుడు. తప్పదు నడిచి తీరాల్సిందే. మొత్తం మీద 5 గంటల పాటు నడిచి 20 నిమిషాల ముందే ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాను. అంత పెద్ద ఆఫీస్ లోకి వెళ్ళడం అదే మొదటిసారి. స్వర్గం లో ఉన్నట్లు అనిపించింది. అక్కడ చాలా మంది ఉన్నారు. వారందరినీ చూసిన తర్వాత నాకు జాబ్ రాదని అర్ధం అయ్యింది. అక్కడున్న వారందరిలో నా అవతారం మాత్రమే చాలా అధ్వాన్నంగా ఉంది.
బాగా అలసిపోయి ఒక కుర్చీలో కూర్చున్నాను. చాలా ఆకలిగా ఉంది. తల్లడిల్లి పోయాను. కానీ నాకు స్పష్టంగా తెలుసు ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఆకలి బాధను తీర్చుకునే దారి లేదని.
కొద్ది సేపటికి నా పేరు పిలిచారు. లేచి నడవ బోతుంటే భారీ కుదుపు. ఒక బూటు కింది అడుగుభాగం ఊడిపోయింది. 20 కిలో మీటర్ల నడకను ఆ పాత బూట్లు తట్టుకోలేక పోయాయి. అందరూ నా వైపే చూస్తున్నారు. చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. మొత్తమ్మీద ఆ బూట్ ను భూమి మీద అదిమిపట్టి కుంటుతూ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళాను. వారితో ఇంగ్లీష్ లో ఏ మాత్రం మాట్లాడలేక పోయాను. నాకు ఇంగ్లీష్ రాయడం మాత్రమే వచ్చు. మొట్ట మొదటి సారిగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఆ రోజే వచ్చింది. వచ్చీ రాని ఇంగ్లీష్...అంతా తడబాటు. నాతో కేవలం 5 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి బయట వెయిట్ చేయమని చెప్పారు. కొద్ది సేపయ్యాక నీవు ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయ్యావు ఇక వెళ్లి పోవచ్చు అని ప్రకటించారు.
బయటికి వచ్చి రెండు రూపాయలతో టీ తాగి మిగిలిన డబ్బుల తో బస్ ఎక్కి దిల్ సుఖ్ నగర్ లోని ఇంటికి చేరుకున్నా.
కానీ ఈ మొదటి ఇంటర్వ్యూ అనుభవం టెక్నాలజీ రంగం లో అడుగు పెట్టాలనే నా తపనను నిలువరించ లేక పోయింది.
Back