అసలు శిరీష నాకు ఎలా పరిచయం అయింది, మా మధ్య లో ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. లాస్ట్ కు మా పెళ్లి చేసిన శివకు గానీ, సహకరించిన నహీంకు గానీ, మా కుటుంబ సభ్యులకు గానీ, శిరీష కుటుంబ సభ్యులకు గానీ ఈ రోజు వరకూ తెలియనే తెలియదు. అసలు సంగతి ఇప్పుడు చెబుతాను.

అది 2004. Yahoo వెబ్ సైట్ లో ప్రొఫైల్ సెర్చ్ ఆప్షన్ ఉండేది. ఒక రోజు నేను ఇంటర్ నెట్ సెంటర్ కు వెళ్లి Hyderabad, 18-20 సంవత్సరాల వయసున్న females కోసం వెతికాను.

కొంత మంది లేడీస్ ప్రొఫైల్స్ వచ్చాయి. అందులో శిరీష ప్రొఫైల్ కూడా ఉంది. అకౌంట్ 2 రోజుల క్రితమే క్రియేట్ చేసినట్లు కనబడింది. వెంటనే యాహూ మెసెంజర్ ఓపెన్ చేసి Hi అని మెసేజ్ పెట్టాను. రిప్లై లేదు. కానీ 3 నెలల తర్వాత "ఎవరు నీవు" అని రిప్లై వచ్చింది.

మెల్లగా మాటలు కలిసాయి. Btech 2nd year అని చెప్పింది. అలా వారానికి ఒకటి రెండుసార్లు చాట్ చేసే వాళ్ళం. తర్వాత సీన్ ఫోన్ లకు మారింది. ఇక ప్రతీ రోజు ఫోన్ మాట్లాడాల్సిందే. కొన్ని రోజుల తర్వాత ఒకసారి కలుద్దామా అని అడిగింది. నన్ను, నా డ్రెస్ ను చూసిన తర్వాత భయపడి నాతో మాట్లాడదు అని నాకు భయమేసింది.

ఉన్నంతలో నీట్ గా తయారై వంద రూపాయలు జేబులో పెట్టుకొని సికింద్రాబాద్ కు వెళ్లాను. ఫైనల్ గా ఒక బేకరీ లో కలిశాం. చూస్తుంటే అది ఖరీదైన బేకరీలాగా ఉంది. భయమేసింది. ఏదైనా ఆర్డర్ చేయ్ అని అడిగింది. నాకేమో పేర్లు తెలియవు. ఎందుకైనా మంచిది నీవే ఆర్డర్ చేయ్ అని చెప్పాను. కొన్ని ఐటమ్స్ వచ్చాయి. భయమేసింది. ఎందుకంటే వాటి ధర ఎంతుంటుందో నాకు అవగాహన లేదు. తిన్నాం. కూల్ డ్రింక్స్ తాగుదామని అవి కూడా ఆర్డర్ చేసింది. ఈసారి గుండె గుభేల్ మంది. నా ధ్యాసంతా బిల్ కట్టగలనా లేదా అని. మొత్తం మీద 100 రూపాయల బడ్జెట్ లోనే కథ ముగిసింది. కానీ 100 రూపాయాలు అంటే అది చాలా పెద్ద బడ్జెట్ నాకు. వారం రోజులు మేమందరం ఆ డబ్బుతో గడప గలం.

నచ్చానా నీకు అని అడిగాను. నల్లగా ఉన్నావు కానీ ఒకే. కానీ నీ ప్యాంట్ షర్ట్ మ్యాచ్ కాలేదు అని చెప్పింది. నాకు సరిగా అర్థం కాలేదు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేశాను. మళ్లీ ఫోన్ కాల్స్ కంటిన్యూ అయ్యాయి.

కొన్ని రోజులయ్యాక నేను ఈ రోజు కాలేజీ కి వెళ్లకుండా దిల్ సుఖ్ నగర్ వస్తున్నాను. కలుద్దాం అని చెప్పింది. ఎక్కడ కలుద్దాం అని అడిగాను. బేకరి లో అని చెప్పింది. బెంబేలెత్తి పోయాను. నాతో 50 రూపాయలు ఉన్నాయి . ఇలా ఉన్న డబ్బు బెకరీ లకు ఖర్చు పెడితే నా పరిస్థితి గోవిందా అని అనుకున్నాను. ఫైనల్ గా మళ్లీ బేకరీ లో కలిశాం. ఉన్న ఆ 50 రూపాయలు కూడా గోవిందా. మళ్లీ అదే డ్రెస్ వేసుకున్నావేంటి అని అడిగింది. మా అక్క, మా అన్న ఆమెరికా లో సెటిల్ అయ్యారు. నేను కూడా అమెరికా వెళ్ళిపోతాను Btech పూర్తి చేశాక. మరి నీ సంగతేంటి అని అడిగింది. మన లవ్ కంటిన్యూ కావాలంటే నీవు ఆమెరికా వెళ్ళే పరిస్థితి లో ఉండాలి అని అన్నది. నేను తప్పకుండా ఆమెరికా వెళ్తాను అని చెప్పాను. ఎలా అని అడిగింది? నేను సైలెంట్ అయ్యాను. ఇంటికెళ్ళి ఈ పిల్లకు నాకు సెట్ కాదు అని డిసైడ్ అయ్యాను. ఫోన్ లో మాటలు తగ్గించా. కానీ చాట్ చేసే వాళ్ళం. కొన్ని నెలలు గడిచాయి.

ఆమెకు అర్థం అయింది నా పరిస్తితి. ఒక రోజు కాల్ చేసింది. నాకు ఇంటర్ లో 930 (exact మార్కులు గుర్తు లేదు) వచ్చాయి. చిన్నప్పటి నుండీ మా క్లాస్ లో ఎప్పుడూ టాప్ ర్యాంక్ నాదే. Btech లో కూడా నేనే టాప్ ర్యాంక్ లో ఉన్నాను. EAMCET లో కోచింగ్ లేకుండా నా ర్యాంక్ 5000. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని టాప్ 10 లో ర్యాంక్ సాధించాలని అనుకున్నా. కానీ ఒక సంవత్సరం వేస్ట్ చేయదల్చుకోలేదు ఎందుకంటే నేను ఎలాగూ అమెరికా లో MS చేస్తా కాబట్టి.

నీవు పేద వాడివని నాకు అర్థం అయింది. నేను చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం లో చదివాను.

కానీ నీతో చాట్ చేసినప్పుడు నీవు రాసే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్థం చేసుకో లేక పోయాను. ఏ రోజూ ఇంగ్లీష్ స్కూల్ లో చదవకుండానే సొంతంగానే ఇంత మంచిగా రాస్తున్నావు. నీ ఆలోచనా విధానం కూడా అందరిలా లేదు. నాకు బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. నీతో పోలిస్తే నా నాలెడ్జ్ సున్నా అని అర్థం అయింది. మా అన్న, అక్క, బావ, మా బంధువులు, మా ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మంది అమెరికా లో MS చేశారు. కానీ వారందరి కంటే నీవే ఏదో ఒకరోజు టాప్ లో ఉంటావు. కోట్ల రూపాయల డబ్బు సంపాదించగలవు. నేను నిన్ను ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోను. మా ఫ్రెండ్స్ కొంత మంది చెప్పారు నీకు ఏమి ఖర్మ ఇలాంటి బాయ్ ఫ్రెండ్ తో ఉన్నావని. కానీ నేనెవరినీ పట్టించుకోను అని చెప్పింది.

తెలిసీ తెలియని వయసులో ప్రేమ మైకం లో ఉన్నప్పుడు ఒక ప్రేయసి తన ప్రియుడి గురించి ఇలాగే ఊహించుకుంటుంది.

నాకు చాలా ఆశ్చర్యం వేసింది నీవు నా గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఊహించుకున్నవన్నీ జరుగవు. నీవు నాతో ఉంటే చాలా కష్టాలు పడతావు. నాకు ఒక్క పూట తిండి దొరకడమే గ్రేట్. నేను చాలా చాలా పేద వాడిని. మనం ఎప్పటికైనా విడి పోయే వాళ్ళమే అని చెప్పాను.

నేను అన్నీ ఆలోచించా. నాకు అమెరికా వద్దు నీతో మాత్రమే కలిసి నడుస్తా అని చెప్పింది.

Back