
అప్పు ను వడ్డీతో సహా తీర్చడం నాకు ఇప్పుడు అత్యంత ప్రధానం. కానీ దానికంటే ముందు నేను డిగ్రీ లో ఫెయిల్ అయిన 2 సబ్జెక్టులు పాస్ కావడం కూడా ముఖ్యం. ఈ 2 సబ్జెక్టు లలో నాకు సున్నా మార్కులు వచ్చాయి. నేను కనీసం పెన్ను కూడా వాడకుండా ఖాళీ ఆన్సర్ షీట్ ను ఇన్విజి లేటర్ కు ఇచ్చి బయట పడ్డాను.
ఇక తప్పదు అని ఆ 2 సబ్జెక్టుల మీద కుస్తీ పట్టి సప్లిమెంటరీ లో బొటా బొటీ మార్కుల తో పాస్ అయ్యాను. కానీ ఆ సంవత్సరం అంతా వృధా అయింది.
అప్పుడప్పుడే రాజు గాడు సీన్ లోకి ఎంటర్ అవుతున్న రోజులు అవి.
ఇక అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించాను. విపరీతంగా కష్టపడ్డాను. ఆ సంవత్సరం అలా గడిచింది. కానీ అప్పుడప్పుడు వడ్డీ వ్యాపారి కి వడ్డీ కూడా చెల్లిస్తూ ఉండే వాడిని.
అది 2001... వడ్డీ వ్యాపారి ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరిస్తున్నాడు. MCA కౌన్సిలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అందుకే MCA బళ్ళారి లో బాగుంటుంది అని మా పేరెంట్స్ ను నమ్మించాను. కానీ ఫీజు 50 వేలు. నా ఉద్దేశం 25 వేలు వడ్డీ వ్యాపారి కి చెల్లించి అప్పు తీర్చడం, మిగిలిన 25 వేలతో హైదరాబాద్ లో MCA లో జాయిన్ కావడం.
50 వేల ఫీజు మనం కట్టలేము అన్నాడు మా డాడీ. బళ్లారి కాకుండా హైదరాబాదు లో 25 వేలకు జాయిన్ కావచ్చు కదా అని అడిగాడు కానీ నేను బళ్లారిలో మాత్రమే ఎంసీఏ బాగుంటుంది అని నమ్మించాను.
చిన్న కొత్తపల్లి లో ఒక సేఠ్ దగ్గర కొంత అమౌంట్ మరియు మా మేనమామ భార్య మెడలోని చైను తాకట్టు పెట్టి మొత్తము 55000 నా చేతిలో పెట్టారు. 50 వేలు ఫీజు కోసం 5 వేలు ఖర్చుల కోసం.
ఆ టైమ్ లో నేను వాళ్ళను మోసం చేస్తున్నాను అని నాకు స్పష్టంగా తెలుసు. డబ్బు ఒక బ్యాగ్ లో పెట్టుకొని బళ్ళారి వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ వచ్చి 25 వేలు చెల్లించి అప్పు తీర్చేశాను. ఇంకా MCA కౌన్సిలింగ్ డేట్ రావడం లేదు.
అందరూ నేను బళ్ళారి లో ఉన్నాను అని అనుకుంటున్నారు. కానీ నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఇంకా కౌన్సిలింగ్ డేట్ రావడం లేదు. రైలు లో బెంగుళూరు, మద్రాస్ మళ్లీ బళ్ళారి కూడా వెళ్ళాను. బళ్లారి వెళ్ళినప్పుడల్లా హైదరాబాద్ లో ఎవరో ఒకరికి ఒక STD కాల్ చేసే వాడిని. ఇదంతా నేను బళ్ళారి లోనే ఉన్నానని నమ్మించడానికి.
అన్ని చోట్లా బస్ స్టేషన్ లు, రైల్వే స్టేషన్ లే నా ఇల్లు. ప్రతీ రోజూ న్యూస్ పేపర్ కొని దానినే దుప్పటి లాగా ఉపయోగిస్తూ ప్లాట్ ఫామ్ మీద పడుకునేవాడిని. ఒకరోజు రాత్రి బెంగుళూరు బస్ స్టేషన్ కు సమీపం లో ప్రశాంతంగా పడుకుందామని ఒక ప్రాంతంలో పడుకున్నాను. అర్ధరాత్రి ఎవరో కొడుతున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే పోలీసులు. వాళ్ళు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు. దారుణంగా కొట్టారు. పరుగెత్తుకుంటూ దగ్గరలో ఉన్న బెంగుళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాను. ఆగి ఉన్న రైలులోకి ఎక్కాను. కొన్ని గంటల్లోనే చెన్నై చేరుకున్నా. నొప్పులు తగ్గడానికి 2 రోజులు పట్టింది.
రెండు నెలలు గడిచాయి. నాలుగైదు వేలు ఖర్చు అయ్యాయి. ఫైనల్ గా కౌన్సిలింగ్ డేట్ వచ్చింది. వెంటనే హైదరబాద్ వచ్చేసాను. 25 వేలు పేమెంట్ చేసి MCA కాలేజీ లో అడ్మిషన్ తీసుకున్నా. ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు.
నేను హైదరాబాద్ లో ఉన్నానని అందరికీ తెలిసి పోయింది. అందరూ షాక్ అయ్యారు. వచ్చే సంవత్సరం మనం బళ్ళారి లో అంతంత ఫీజు చెల్లించలేము కదా అందుకే అక్కడ కట్టిన 30 వేల ఫీజు ను వదిలేసి ఇక్కడ జాయిన్ అయ్యాను అని వారికి అబద్దం చెప్పాను. కానీ 30 వేలు కోల్పోయాం కదా అని చాలా బాధ పడ్డారు.
అలా ఏదో ఒక రకంగా మళ్ళీ హైదరాబాద్ లో స్థిర పడ్డాను. సరిగ్గా అదే సమయంలో శివ శంకర్ గాడు కూడా ఇబ్రహీం పట్నం లోని ఒక MCA కాలేజిలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుండి వాడితో స్నేహం పెరిగి పోయింది.
ఇక అసలు కథ నేను మొదటి సారి కాలేజీకి వెళ్లిన రోజు ప్రారంభం అయింది. అది మరో పోస్ట్ లో....
Back