అప్పుడు నాకు 19 సంవత్సరాలు నిండాయి. మా డాడీ పీకల్లోతు అప్పుల్లో మునిగి పోయాడు. తనకున్న ఒకే ఒక లారీని (టిప్పర్) వదిలేసి ఊరికి వెళ్లి పోయాడు.

నాకు దాన్ని రిపేర్ చేయించి డబ్బు సంపాదించాలని ఉండేది. డాడీ వద్దే వద్దు అన్నాడు. కానీ నేను ఏదో ఒకటి చేయాలని అనుకున్నా. ఒక వడ్డీ వ్యాపారిని కలిసి లారీ పేరు చెప్పి నెలకు 5 రూపాయల వడ్డీ కి 20000 అప్పు (కరెక్ట్ అమౌంట్ గుర్తు లేదు) చేశాను. అందుకు గాను నా SSC సర్టిఫికేట్ ను అతడు షూరిటీ గా పెట్టుకున్నాడు. మొత్తం మీద ఇంకొంచెం డబ్బు పోగు చేసి రిపేర్ చేయించాను.

ఇక చిన్న చిన్న గిరాకీలు కూడా వస్తున్నాయి. నేను లారీ క్లీనర్ గా పని చేసే వాడిని. రాత్రి టైమ్ లో ట్రాఫిక్ తక్కువ కాబట్టి ఆ టైమ్ లో మాత్రం నేనే డ్రైవర్, క్లీనర్. ఇలా కొన్ని నెలలు నడిపాను. వారం రోజులకు ఒకసారి స్నానం. దగ్గర్లో ఉండే హోటల్ లో భోజనం పార్సిల్ తీసుకొని టైమ్ దొరికినప్పుడు రోడ్ పక్కన కూర్చుని తినే వాడిని. ఆరోజుకు అదొక్క పూటే నా భోజనం. ఇక మళ్లీ భోజనం మరుసటి రోజే.

నేను పిల్లోడిని అని గమనించి కాంట్రాక్టర్లు నాకు డబ్బు ఎగ్గొట్టే వారు. వాళ్ల ఇంటి చుట్టూ తిరిగే వాడిని. డ్రైవర్ కు జీతం ఇవ్వలేక పోయాను. రెండు మూడు నెలలు వడ్డీ మాత్రం కట్టాను. లారీ మళ్లీ చెడి పోయింది. నాతో ఒక్క రూపాయి కూడా లేదు. కొన్ని రోజుల్లోనే నేను కూడా అప్పుల్లో కూరుకుపోయాను.

మరోవైపు వడ్డీ వ్యాపారి ఊర్లో మా ఇంటికి వెళ్ళి మా డాడీ తో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. అతడు మా ఇంటి ముందు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. నేను మాత్రం భయం తో తప్పించుకుని తిరుగుతున్నా. లారీ సంగతి మర్చిపోయాను. ఈ రోజు వరకూ కూడా నాకు దాని జాడ తెలియదు.

నా ప్రయత్నం అంతా కూడా వడ్డీ తో సహా అప్పు తీర్చడం ఎలా అని... మాదాపూర్ నుండి అంబర్ పేట తర్వాత దిల్ సుఖ్ నగర్ కు మారిపోయాను.

కానీ రూమ్ రెంట్ కట్టలేని నాకు అప్పు తీర్చడం అనేది గగనం అయ్యింది. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఫీజు కట్టడం లేదు కాబట్టి నన్ను కాలేజీ కి రానిచ్చే వారు కాదు. ఒకవేళ నేను ఎప్పుడన్నా కాలేజి కి వెళ్తే అందరూ నన్ను ఎగతాళి చేసే వారు. అందుకే నాకు కాలేజీ అంటే భయం వేసేది. డిగ్రీ మూడు సంవత్సరాల కాలం లో నేను బహుశా 20 సార్లు మాత్రమే కాలేజీ కి వెళ్లి ఉంటాను.

చివరికి డిగ్రీ పరీక్షలలో ఫెయిల్ అయ్యాను. నేను డిగ్రీ ఫెయిల్ అయిన సంగతి ఈ రోజు వరకూ ఎవరికీ తెలియదు. అసలు సబ్జెక్టులలో ఏముందో కూడా నాకు తెలియదు. మా డాడీ కి గానీ మా ఇంట్లో వారికి గానీ నేను ఫెయిల్ అయిన సంగతి ఈ రోజుకీ తెలియదు. కటిక పేదరికం లో మగ్గుతున్న వాళ్ళ కు ఇది తెలిస్తే మరింత కుంగిపోతారని దాచి పెట్టాను.

అదీగాక నేను ఫెయిల్ అయినట్లు ఏ ఒక్కరికి తెలిసినా నాకు ముందు ముందు డబ్బు పుట్టే అన్ని మార్గాలూ మూసుకు పోతాయి అనేది కూడా నా భయం.

కానీ బయటికి మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపించే వాడిని. అప్పు తీర్చే క్రమం లో నేను చేసిన పనులు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అది మరో పోస్ట్ లో రాస్తాను.

Back